కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14వ తేదీ నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం 7వ రోజు కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఘనంగా జరిగాయి.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ సోమయాగానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకకల్యాణం కోసం ఇటువంటి యజ్ఞయాగాలు, ఉత్సవాలు, పూజలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయని, అదే విధంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారినుండి విముక్తి కలగాలని సమస్తమానవాళి సుఖంగా ఉండాలనే సంకల్పంతో ప్రగతిసుధామలో ప్రగతి గ్రూప్ అధినేత జి.బి.కె. రావు గారు రాజిరెడ్డి గారు, నిర్మల గోనెల గారు ఈ యాగాన్ని నిర్వహించడం ముదావహమని, అలాగే జి.బి.కె. రావు గారు ఎంతో అంకితభావంతో ఒక యజ్ఞంలా తపస్సులా ఎన్నో ఏళ్ళుగా ప్రగతి సుధామలో వనమూలికలను రక్షించి భావితరాలకు అందించే ప్రయత్నం చేయడం విశేషమైనదని అన్నారు. ఈ సందర్భంగా భారతప్రభుత్వం తరఫున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి తరఫున యాగ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, పి.సి. శేఖర్ రెడ్డి, అఖిలభారత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై రాఘవులు చేవెళ్ల శాసన సభ్యులు, శ్రీ కాలె యాదయ్య తదితరులు ఈ యాగంలో పాలు పంచుకున్నారు.
ఈ నాటి ఉదయం కోలాహలంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అవభృతస్నానం, ఉదయిని ఇష్టి, కర్మార్పణం క్రతువులతో ఈ వాజపేయ సోమయాగం కార్యక్రమం ముగిసింది. అనంతరం సాయంత్రం 5 గంటలకు వాజపేయానికి అనుబంధంగా నిర్వహించవలసిన “బృహస్పతి సోమయాగం” ఆరంభమైనది.
అవభృతస్నానానికి ముందు జరిగిన అవభృత ఇష్టికార్యక్రమం రిసార్టులోని ఈతకొలనులో (స్విమ్మింగ్ పూల్) లో జరిగింది. ఈ ఇష్టిలో ఆవునెయ్యి, పురోడాశం మొదలైన ఆహూతులను జలం ద్వారా దేవతలకు సమర్పించారు. సోమరసాన్ని వేరుచేయగా మిగిలిన సోమలత పిప్పినీ, యాగంలో నేటివరకు ఉపయోగించిన పాత్రలను జలంలో నిమజ్జనం చేసారు. అనంతరం కోలాహలంగా, భక్తిశ్రద్ధలతో అవభృతస్నానం కార్యక్రమం జరిగింది. అవభృత స్నానంలో భాగంగా యాగ యజమాని బ్రహ్మశ్రీ యామవరం అనంతకృష్ణశర్మ సోమయాజి, మాధురి సోమిదేవమ్మ దంపతులు, ఋత్వికగణం, ప్రగతి గ్రూప్ చైర్మన్ డా. జి.బి.కె. రావు దంపతులు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, చేవెళ్ల శాసన సభ్యులు శ్రీ కాలె యాదయ్య తదితరులంతా ఈతకొలను లోని పవిత్రజలంలో అవభృతస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 1 గంటకు తొలిదశలో వాజపేయ మహాసోమయాగం ముగిసింది.
తిరిగి సాయంత్రం 5 అనుబంధ బృహస్పతి సోమయాగం మహాసంకల్పంతో ఆరంభమయింది. మధుపర్కం, దిక్షణీయ ఇష్టి, దిక్ష, సనిహార తదితర క్రతువులతో యాగానికి అంకురార్పణ జరిగింది. రేపటినుండి వరుసగా ఐదురోజులపాటు జరిగే క్రతువులతో మహాయజ్ఞం పూర్తవుతుంది.
డి.ఆర్.డి.వో. చైర్మన్, రక్షణశాఖ సెక్రటరీ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ అభివృద్ధిసంస్థ డైరెక్టర్ జనరల్ డా. జి. సతీశ్‌రెడ్డి, పద్మశ్రీ డా. కార్తికేయన్, గుల్బర్గా మాజీ ఎం.పి. డా. ఉమేష్ యాదవ్ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయ అధికారి శ్రీమతి శశికళ, శ్రీ శ్రీ శ్రీ చాముండేశ్వరీ మహర్షిగారు, బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారు, తెలంగాణ గురుకులవిద్యాలయ సంస్థ కార్యదర్శి బ్రహ్మశ్రీ శాస్త్రుల వేంకటేశ్వర శర్మగారు ఈ యాగానికి ప్రత్యేక అతిథులుగా యాగాన్ని సందర్శించారు .
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ యజ్ఞవిశేషాలను తమ వ్యాఖ్యానం ద్వారా ఆద్యంతం శ్రవణసుభగంగా వివరించారు.