చిలుకూరు రోడ్డు, శంకరపల్లి మండలం, పొద్దుటూరు లోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్) లో అద్భుత ఉత్కృష్ట వాజపేయ మహా సోమయాగం 8వరోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాలాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14వ తేదీ నుండి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వాజపేయ మహాసోమయాగానికి అనుబంధంగా జరుగుతున్న బృహస్పతి సోమయాగం రెండవరోజు కార్యక్రమాలు నేడు వేదోక్తంగా సాగాయి. దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.
వాజపేయ సోమయాగం కోసం ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో సర్వాంగసుందరంగా వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో నిర్మించిన యాగశాలలో ఉదయం 7 గంటలకు ప్రాయణీయ ఇష్టి అనే క్రతువుతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ వేదమూర్తులు మంగేష్ శర్మ గారి అధ్వర్యవంలో వేదోక్తంగా వాజపేయ యాగ యజమాన బాధ్యతలు తీసుకున్న బ్రహ్మశ్రీ యామవరం అనంతకృష్ణశర్మ సోమయాజి, మాధురి సోమిదేవమ్మ దంపతులు సశాస్త్రీయంగా రెండవరోజు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రాయణీయ ఇష్టి అనంతరం సోమక్రయము, సోమ ఆప్యాయనము, యాగ పరిక్రమ, ప్రవర్గ్య సంభరణం, పూర్వాహ్నప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం కార్యక్రమాలు కొనసాగాయి.
ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, పి.సి. శేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాగంలో నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ అమోయ్ కుమార్ గారు, ఉత్తరాఖండ్ లోని కపిల ఆశ్రమం నుండి శ్రీ రామచంద్రభారతి స్వామీజీ మరియు మాతా నిర్మలానంద యొగభారతి ప్రత్యేక అతిథులుగా యాగాన్ని సందర్శించారు.
యాగానికి ప్రధానమైన సోమలతను దాని యజమాని నుండి తగిన మూల్యం చెల్లించి సంపాదించి ఆ సోమలతను అతిథిగా భావించి ప్రత్యేకమైన రథంలో యాగశాల చుట్టూ పరిక్రమ చేయించడం, దానికి సమంత్రంగా నీటితో చేయడం ఈనాటి విశేషం. అనంతరం జరిగిన పూర్వాహ్నప్రవర్గ్యంలో బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యు గణాలకు చెందిన పదహారుమంది ఋత్విక్కులు పాల్గొన్నారు. వేదోక్తంగా, యజ్ఞపురుషుని సాక్షిగా పదహారుమంది ఋత్విక్కులు శ్రౌతమంత్రాలు పఠిస్తూ ఉండగా దాదాపు రెండుగంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా ఆహూతులు ఇస్తున్నప్పుడు దాదాపు ఇరవైఅయిదు అడుగుల ఎత్తు వరకూ అగ్నిజ్వాల ప్రజ్వరిల్లింది. ఆ తరువాత జరిగిన శాంతి కార్యక్రమాలైన ఉపసద్ ఇష్టి, సామవేదగానంతో కూడిన సుబ్రహ్మణ్య ఆవాహనములతో మద్యాహ్నం 1 గంటకు తొలి అంకం ముగిసింది.
విరామం అనంతరం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు జరిగిన రెండవ అంకంలో అపరాహ్న ప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం కార్యక్రమాలు జరిపి నైవేద్యం సమర్పించిన అనంతరం రెండవరోజు క్రతువు ముగిసింది.
మద్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు లోకకల్యాణానికై యాగాలు (Yagas for World Wellness) అనే అంశంపై జూమ్ మాధ్యమం ద్వారా అంతర్జాతీయ వెబినార్ జరిగింది. ఇందులో పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.