ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం మూడవరోజు కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ఘనంగా జరిగాయి. ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, ప్రెసిడెంట్ ప్రముఖ ప్రకృతివైద్య నిపుణులు డా. ఖాదర్ వలీ, పి.సి. శేఖర్ రెడ్డి, అఖిలభారత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై రాఘవులు, శంతాబయోటెక్ అధినేత కోడూరి ఈశ్వరవరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా మహాసంకల్పం చేసి నిర్వహిస్తున్న ఈ వాజపేయ సోమయాగం కోసం ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఉదయం 9 గంటలకు మూడవరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాజపేయ యాగ యజమాన బాధ్యతలు తీసుకున్న బ్రహ్మశ్రీ యామవరం అనంతకృష్ణశర్మ సోమయాజి, మాధురి సోమిదేవమ్మ దంపతుల సమక్షంలో ఆధర్వ్యు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మంగేష్ శర్మ గారి అధ్వర్యవంలో 17 మంది ఋత్వికులతో వేదోక్తంగా సశాస్త్రీయంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ మూడవరోజు క్రతువులో భాగంగా పూర్వాహ్నప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం, మహావేదీకరణం, వ్రతోపానం, యూపకర్మ వంటి ముఖ్యమైన క్రతువులు ఉదయం 7 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు సశాస్త్రీయంగా, సమంత్రంగా నిర్వహింపబడ్డాయి. పూర్వాహ్న ప్రవర్గ్యము ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై 11.30 వరకు కొనసాగింది. ప్రవర్గ్యలో భాగంగా ఆహూతులు ఇస్తున్నపుడు సుమారు 25 అడుగులవరకు అగ్ని ప్రజ్వరిల్లింది. దీని ఫలితంగా వాతావరణ శుద్ధి జరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఆ తరువాత సుమారు ఇరవై నిముషాలు జరిగిన మహావేదీకరణంలో ఋత్వికులు సదోమంటపం, హవిరుత్థానమంటపం, ఆగ్నిధ్య మంటపాలను సిద్ధం చేసారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్వర్వ్యు, ప్రతిప్రస్థాత, ఆగ్నిధ్ర, బ్రహ్మ, నేష్ట అనే ఐదుగురు ఋత్విక్కులు నిర్వహించారు. అనంతరం జరిగిన యూపకర్మ క్రతువులో ఔదంబర వృక్ష ( మేడిచెట్టు) కాండం నుండి యూపము (శిఖ) ను తయారుచేసే కార్యక్రమం నిర్వహించారు.
తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన రెండవ అంకంలో భాగంగా అపరాహ్న ప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం చేసి ఆ తరువాత యజమాని దంపతులచేత వ్రతోపానం చేయించడంతో మూడవరోజు కార్యక్రమం పూర్తయింది.
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య స్వామివారు, శ్రీ శ్రీ శ్రీ విద్యా గణేశానందభారతీ స్వామివారు ఈ యాగానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు ఆశీస్సులందించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య స్వామివారు తమ దివ్యసందేశంలో మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ఇటువంటి యాగాలవెనుక విశేషమైన శక్తినిచ్చే తత్వం ఉన్నదని, నేటి కాలంలో మాత్రం మన సంస్కృతిని వదలి పాశ్చాత్యసంస్కృతి వెనుక పరుగులు తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ యజ్ఞవిశేషాలను తమ వ్యాఖ్యానం ద్వారా ఆద్యంతం శ్రవణసుభగంగా వివరించారు.