ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14 నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం అనుబంధయాగమైన బృహస్పతిసవ సోమయాగం మూడవరోజు కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ఘనంగా జరిగాయి. ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, పి.సి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్, శాంతా బయోటెక్నిక్స్ అధినేత కోడూరు ఈశ్వరవరప్రసాద్, గాయకులు డా. ఎం. శ్రీనివాస్ యాగాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ గరికిపాటి ధార్మికోపన్యాసం చేసారు.
కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా మహాసంకల్పం చేసి నిర్వహిస్తున్న ఈ వాజపేయ సోమయాగం కోసం ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఉదయం 9 గంటలకు నాలుగవరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. . బృహస్పతి సోమయాగ యజమాన బాధ్యతలు తీసుకున్న బ్రహ్మశ్రీ దీక్షిత అనంతకృష్ణశర్మ వాజపేయయాజి యామవరం, మాధురి సోమిదేవి దంపతులతో ఆధర్వ్యు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మంగేష్ శర్మ గారి అధ్వర్యవంలో 17 మంది ఋత్వికులతో వేదోక్తంగా సశాస్త్రీయంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
క్రతువులో భాగంగా పూర్వాహ్నప్రవర్గ్యము, అపరాహ్న ప్రవర్గ్యము ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం మొదలైన క్రతువులు ఉదయం 7 గంటలనుండి సశాస్త్రీయంగా, సమంత్రంగా నిర్వహింపబడ్డాయి. పూర్వాహ్న ప్రవర్గ్యము ప్రవర్గ్యలలో భాగంగా ఆహూతులు ఇస్తున్నపుడు సుమారు 25 అడుగులవరకు అగ్ని ప్రజ్వరిల్లింది. దీని ఫలితంగా వాతావరణ శుద్ధి జరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఆ తరువాత ఇప్పటివరకూ వాడిన ప్రవర్గ్యపాత్రలను దహనం చేసే ప్రవర్ఘ్య ఉద్వాసనం, ఋత్వికులు సదోమంటపం, హవిరుత్థానమంటపం, ఆగ్నిధ్య మంటపాలను సిద్ధం చేసారు.
తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన రెండవ అంకంలో భాగంగా అగిసోమ ప్రధాన దేవతగా అగ్నిషోమయాగం జరిగింది. అనంతరం రేపటి స్తుత్యాహ కార్యక్రమానికి దేవతలను ఆహ్వానించడానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకునే సుత్యోపక్రమణిక మరియు సుబ్రహ్మణ్య ఆవాహనలతో ఈ రోజు కార్యక్రమం పూర్తయింది.
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ యజ్ఞవిశేషాలను తమ వ్యాఖ్యానం ద్వారా ఆద్యంతం శ్రవణసుభగంగా వివరించారు.