ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14 నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం అనుబంధయాగమైన బృహస్పతిసవ సోమయాగం నాలుగవరోజు కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ఘనంగా జరిగాయి. ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, పి.సి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు, బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజి నేటి యాగాన్ని వీక్షించారు. అనంతరం శ్రీ గరికిపాటి ధార్మికోపన్యాసం చేసారు.
కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా మహాసంకల్పం చేసి నిర్వహిస్తున్న ఈ వాజపేయ సోమయాగం కోసం ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఉదయం 9 గంటలకు నాలుగవరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. . బృహస్పతి సోమయాగ యజమాన బాధ్యతలు తీసుకున్న బ్రహ్మశ్రీ దీక్షిత అనంతకృష్ణశర్మ వాజపేయయాజి యామవరం, మాధురి సోమిదేవి దంపతులతో ఆధర్వ్యు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మంగేష్ శర్మ గారి అధ్వర్యవంలో 17 మంది ఋత్వికులతో వేదోక్తంగా సశాస్త్రీయంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
క్రతువులో భాగంగా ప్రాతఃసవనము, మహాభిషవము, ఋతుయాగము, శస్త్ర స్తోత్ర శంశన, మొదలైన క్రతువులు ఉదయం 7 గంటలనుండి సశాస్త్రీయంగా, సమంత్రంగా నిర్వహించారు. సోమయాగంలో ప్రధానమైన ప్రాతఃసవనములో భాగంగా జరిగిన ఋతుయాగంలో సోమలతను దంచి ఆ రసాన్ని సేకరించి గ్రహాలనబడే ప్రత్యేకంగా చండ్ర, జువ్వి మొదలైన చెట్ల కలపతో తయారుచేసిన గ్రహాలనబడే పాత్రలలో ఉంచి హవిస్సుగా అర్పించారు. ఆ తరువాత యజమానితో సహా ఋత్వికులంతా ఆ సోమరస ప్రసాదాన్ని పానం చేసారు . మధ్యంతరసవనము దక్షిణాహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు క్రతువులో భాగంగా తృతీయసవనము, యజ్ఞపుచ్ఛం, సర్వప్రాయశ్చిత్తం, సవనాహుతి మొదలైన క్రతువులు సాయంత్రం 4 గంటలనుండి సశాస్త్రీయంగా, సమంత్రంగా నిర్వహించారు. గ్రహాలనబడే ప్రత్యేకంగా చండ్ర, జువ్వి మొదలైన చెట్ల కలపతో తయారుచేసిన గ్రహాలనబడే పాత్రలలో ఉంచి హవిస్సుగా అర్పించారు. ఆ తరువాత యజమానితో సహా ఋత్వికులంతా ఆ సోమరస ప్రసాదాన్ని పానం చేసారు. తదనంతరం శస్త్రస్తోత్రం, సహాయదేవతలకు ఆహూతులు సమర్పించే యజ్ఞపుచ్ఛం, యాగంలో దొర్లిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా చేసే సర్వప్రాయశ్చిత్తం మొదలైన కార్యక్రమాలు జరిగాయి.
రేపు ఉదయం జరిగే అవభృతస్నానం, పూర్ణాహుతితో వాజపేయ మహాసోమయాగం, బృహస్పతిసవ సోమయాగం పరిపూర్ణమవుతాయి.
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ యజ్ఞవిశేషాలను తమ వ్యాఖ్యానం ద్వారా ఆద్యంతం శ్రవణసుభగంగా వివరించారు.