కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14వ తేదీ నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగానికి అనుబంధ యాగమైన బృహస్పతిసవ సోమయాగం ఐదవరోజు పూర్ణాహుతితో పరిపూర్ణమయింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఘనంగా జరిగాయి.
ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల, పి.సి. శేఖర్ రెడ్డి, ఆయుర్వేద వైద్యులు జె.ఆర్.రాజు అఖిలభారత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై రాఘవులు తదితరులు ఈ యాగంలో పాలు పంచుకున్నారు.
ఈ నాటి ఉదయం 9 గంటలనుండి కోలాహలంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అవభృతస్నానం, ఉదయిని ఇష్టి, కర్మార్పణం క్రతువులతో ఈ బృహస్పతిసవ సోమయాగం కార్యక్రమం ముగిసింది. దీంతో 14వతేదీ నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం పరిపూర్ణమైంది.
అవభృతస్నానానికి ముందు జరిగిన అవభృత ఇష్టికార్యక్రమం రిసార్టులోని జలాశయంలో జరిగింది. ఈ ఇష్టిలో ఆవునెయ్యి, పురోడాశం మొదలైన ఆహూతులను జలం ద్వారా దేవతలకు సమర్పించారు. సోమరసాన్ని వేరుచేయగా మిగిలిన సోమలత పిప్పినీ, యాగంలో నేటివరకు ఉపయోగించిన పాత్రలను జలంలో నిమజ్జనం చేసారు. అనంతరం కోలాహలంగా, భక్తిశ్రద్ధలతో అవభృతస్నానం కార్యక్రమం జరిగింది. అవభృత స్నానంలో భాగంగా యాగ యజమాని బ్రహ్మశ్రీ యామవరం అనంతకృష్ణశర్మ సోమయాజి, మాధురి సోమిదేవమ్మ దంపతులు, ఋత్వికగణం, ప్రగతి గ్రూప్ చైర్మన్ డా. జి.బి.కె. రావు దంపతులు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల తదితరులంతా ఈతకొలను లోని పవిత్రజలంలో అవభృతస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 1 గంటకు బృహస్పతి సవసోమయాగం ముగిసింది.
స్థానిక శాసనసభ్యులు శ్రీ కాలె యాదయ్య, రాష్ట్ర ఆర్థికసంస్థ చైర్మన్, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్, తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజేంద్ర సింగ్ చౌహాన్, తెలంగాణా ప్రభుత్వ లోకాయుక్త న్యాయమూర్తులు శ్రీ సీ.వి. రాములు, మానవహక్కులసంఘం అధ్యక్షులు న్యాయమూర్తి శ్రీ చంద్రయ్య మరియు సెక్రెటరీ, సీఈవో శ్రీ విద్యాధర్ భట్, న్యాయమూర్తులు శ్రీ టి. వినోద్, శ్రీ నవీన్ రావు, శ్రీ విజయసేన్ రెడ్డి, శ్రీ ఎం.ఎస్.కె. జైస్వాల్, శ్రీ ఆనందరావు, సి.బి.ఐ. రిటైర్డ్ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర భూసమీకరణ సంస్థ ప్రిసైడింగ్ అధికారి శ్రీ నాగమారుతి శర్మ, ఆస్థాగ్రూప్ అధినేత శ్రీ కేశవరెడ్డి, యూకోబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీ కుమారస్వామి, సి.ఎం కెసీఆర్ బాల్యగురువు శ్రీ వేలేటి మృత్యుంజయశర్మగారు తదితరులు ప్రత్యేక అతిథులుగా యాగాన్ని సందర్శించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు .
అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటలవరకు శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ యజ్ఞవిశేషాలను తమ వ్యాఖ్యానం ద్వారా ఆద్యంతం శ్రవణసుభగంగా వివరించారు.