ప్రగతి సుధామ ఆధ్వరంలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.), శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హాల్యాండ్ అండ్ వ్యాస ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నెల 14వ తేదీ నుండి జరుగుతున్న ఉత్కృష్ట వాజపేయ మహాసోమయాగం కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, పొద్దుటూరు గ్రామం, చిలుకూరు రోడ్డులోని ప్రగతి సుధామ (ప్రగతి రిసార్ట్స్)లో దేశంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఉద్దండులైన వేదపండితులు, ఆహితాజ్ఞుల వేదమంత్రాలతో ఘనంగా జరిగాయి. ఈనెల 25వ తేదీ వరకు ఈ మహాయాగం జరుగుతుంది. ప్రగతి గ్రూప్ చైరన్ డా. జి.బి.కె. రావు, వాజపేయ మహాసోమయాగ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి డా. ఇ. రాజిరెడ్డి, కన్వీనర్ డా. నిర్మలాదేవి గోనెల తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు ముఖ్యాతిథులుగా కరీంనగర్ నుండి శృంగేరీ పీఠం ఆస్తాన్ విద్వాన్ బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, తెలంగాణా రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ప్రాంతీయప్రచారక్ అధ్యక్షులు శ్రీ దవేందర్ గారు ప్రగతి సుధామకు విచ్చేసి యాగాన్ని సందర్శించారు.
కోవిడ్ పై విజయం, కరోనా నిర్మూలనం, సర్వజనహితం, లోకకల్యాణమే లక్ష్యంగా మహాసంకల్పం చేసి నిర్వహిస్తున్న ఈ వాజపేయ సోమయాగం కోసం ప్రగతిరిసార్ట్స్లో ఆహ్లాదకర సుందరవనంలోని సువిశాల ప్రాంగణంలో వేద, ఆగమ, వాస్తు ప్రమాణాలతో యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించిన యాగశాలలో ఉదయం 9 గంటలకు నేటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బృహస్పతి సోమయాగ యజమాన బాధ్యతలు తీసుకున్న బ్రహ్మశ్రీ దీక్షిత అనంతకృష్ణశర్మ వాజపేయయాజి యామవరం, మాధురి సోమిదేవి దంపతులతో ఆధర్వ్యు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మంగేష్ శర్మ గారి అధ్వర్యవంలో 17 మంది ఋత్వికులతో వేదోక్తంగా సశాస్త్రీయంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
క్రతువులో భాగంగా పూర్వాహ్నప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం, మహావేదీకరణం, వ్రతోపానం, యూపకర్మ వంటి ముఖ్యమైన క్రతువులు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు సశాస్త్రీయంగా, సమంత్రంగా నిర్వహింపబడ్డాయిప్రవర్గ్యలో భాగంగా ఆహూతులు ఇస్తున్నపుడు సుమారు 25 అడుగులవరకు అగ్ని ప్రజ్వరిల్లింది. దీని ఫలితంగా వాతావరణ శుద్ధి జరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఆ తరువాత సుమారు ఇరవై నిముషాలు జరిగిన మహావేదీకరణంలో ఋత్వికులు సదోమంటపం, హవిరుత్థానమంటపం, ఆగ్నిధ్య మంటపాలను సిద్ధం చేసారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్వర్వ్యు, ప్రతిప్రస్థాత, ఆగ్నిధ్ర, బ్రహ్మ, నేష్ట అనే ఐదుగురు ఋత్విక్కులు నిర్వహించారు. అనంతరం జరిగిన యూపకర్మ క్రతువులో ఔదంబర వృక్ష ( మేడిచెట్టు) కాండం నుండి యూపము (శిఖ) ను తయారుచేసే కార్యక్రమం నిర్వహించారు.
తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన రెండవ అంకంలో భాగంగా అపరాహ్న ప్రవర్గ్యము, ఉపసద్ ఇష్టి, సుబ్రహ్మణ్య ఆవాహనం చేసి ఆ తరువాత యజమాని దంపతులచేత వ్రతోపానం చేయించడంతో మూడవరోజు కార్యక్రమం పూర్తయింది.
దర్శనం సంపాదకులు శ్రీ మరుమాముల వేంకటరమణ శర్మ గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఆద్యంతం యజ్ఞవిశేషాలపై శ్రవణసుభగంగా వ్యాఖ్యానించారు.